రైతన్న కంట కన్నీరు రేవంత్ పాలనకు నిదర్శనం..
రైతుల భూములపై 22ఏ నిషేధం ఎత్తివేయాలి..
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
గుమ్మడిదలలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్న పోరుబాట..
గుమ్మడిదల
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెయ్యి రోజుల పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసం కావడంతోపాటు.. రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 420 మోసాల పైన బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరు బాటలో భాగంగా శనివారం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతన్న పోరు బాట కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో విప్లవత్మక మార్పులు తీసుకొని రావడంతో పాటు రైతుని రాజు చేస్తానంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతుబంధు, రైతు బీమా వంటి విప్లవాత్మక పథకాలకు చరమగీతం పాడడంతో పాటు కనీస మద్దతు ధర అందించక రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో గ్రామాల సమగ్ర అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు పోరాడిన కేసీఆర్.. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడంతో పాటు రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగానికి అండగా నిలిచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ సమస్యల కారణంగా పొలాల్లో మోటార్లు ఆన్ చేసేందుకు వెళ్లిన రైతులు పాముకాట్లకు, ఇతర ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయని, ఆ పరిస్థితులను మార్చేందుకు 24 గంటల విద్యుత్ సరఫరా తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు కెసిఆర్ అని గుర్తు చేశారు.
22ఏ పేరుతో రైతులను వేధించడం సరికాదు
ప్రస్తుతం జిన్నారం, గుమ్మడిదల తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆరోపించారు. రైతుల భూములను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి వారిని మానసికంగా, ఆర్థికంగా వేధించడం తగదన్నారు.
రైతుల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని, లేకపోతే ముఖ్యమంత్రి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల భూములను కాపాడేందుకు పోరాటం
ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పరిశ్రమల కోసం కేటాయించిన భూముల విషయంలోనూ అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల భూముల విషయంలో అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం ఉంటే వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాల్సిన ప్రభుత్వం, ఉన్న భూములపైనే వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.
“రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు”
రైతులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST