బౌరంపేట దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు–ఎంపీ ఈటెల రాజేందర్

Sakshitha news

బౌరంపేట దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు–ఎంపీ ఈటెల రాజేందర్

బౌరంపేట్ దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలం లోని బౌరంపేట ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక దళితులు సర్వే నెంబర్ 472 ఎర్రమన్ను బొందల స్థలాన్ని సందర్శించారు. అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన బౌరంపేట దళితులను ఉద్దేశించి ప్రసంగించారు. బౌరంపేట్ మాజీ సర్పంచ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా వ్యవసాయం జీవనాధారంగా చేసుకొని జీవించిన దళితులకు ప్రభుత్వం ఏ పరిహారం ఇవ్వకుండానే అసైన్మెంట్ స్థలాలను వాపస్ తీసుకోవడం ధర్మం కాదని అన్నారు. దుండిగల్ లో అసైన్మెంట్ స్థలాలను ప్రభుత్వం తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఎకరాకు అసై నీకు 700 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసి ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకుందని అన్నారు. అలాగే బౌరంపేట్ లో సర్వే నెంబర్ 472 లో కూడా ఇదే విధానాన్ని పాటించి ప్రతి ఎకరా నుండి అసైనీదారులకు 1000 గజాల స్థలాన్ని అన్ని హక్కులతో అసైన్ మెంట్ దారులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బౌరంపేట దళితులకు ప్రభుత్వం నుండి పరిహారంగా భూమి పొందే వరకు ఎవరు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.

జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపవద్దని న్యాయంగా వారికి అందాల్సిన నష్టపరిహారం ఇప్పించేంతవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన బౌరంపేట మాజీ సర్పంచ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ మాట్లాడుతూ ఇంతవరకు సర్వేనెంబర్ 472లో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు నేడు ప్రభుత్వం వ్యవసాయం చేయకుండా ఆపడంతో ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఊరికి ఒక్కో న్యాయం చేయవద్దని, దుండిగల్ అసైనీదారులకు ఏమాదిరిగా పరిహారం ఇస్తున్నారో అదే మాదిరిగా ప్రతి ఎకరాకు ఒక వెయ్యి గజాలు స్థలాన్ని దళితులకు కూడా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో బిజెపి దుండిగల్ సర్కిల్ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు నల్ల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ జంగారెడ్డి లు ప్రసంగించారు.

కార్యక్రమంలో బౌరంపేట్ సర్వే నెంబర్ 166 కు చెందిన అసైని దారులు కూడా హాజరై తమకు కూడా ఎలాంటి పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదని ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 166 లో మొత్తం 450 ఎకరాలు స్థలం ఉండగా అందులో పోలీస్ డిపార్ట్మెంట్ కు 50 ఎకరాలు, స్మశాన వాటికకు 10 ఎకరాలు, డంపింగ్ యార్డ్ కు 10 ఎకరాలు, డబల్ బెడ్రూమ్స్ ఇళ్లకు 10 ఎకరాలు కేటాయించినట్లు వారు ఎంపీ ఈటెల రాజేందర్ కు వివరించారు. సుమారు 140 ఎకరాలు ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్న రైతుల అదుపులో భూమి ఉన్నట్లు తెలిపారు. దీంతో సర్వే నెంబర్ 166 అసైన్మెంట్ దారులకు కూడా న్యాయం జరిగే వరకూ పోరాటం చేద్దామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. కార్యక్రమానికి బౌరంపేట దళితులు వందలాదిగా హాజరయ్యారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఈ సమావేశానికి రానున్నారని ప్రచారం జరిగిన ఆయన ఈ సమావేశానికి రాలేదు. ఈ సమావేశంలో బౌరంపేట దళిత నేతలు డప్పు కృష్ణ, బాలా గారి నరసింహ, కొమ్ము యాదయ్య, చింతకింది రమేష్, చింతకింది ముత్తమ్మ, కొమ్ము వీరయ్య, బలగారి మల్లేష్, చింతకింది రాము లమ్మ, అగ్రి నరసింహ, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.