నీటి వనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు

Sakshitha news

నీటి వనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు
ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి…..

చెరువుల కట్టలు, తూముల పటిష్టతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి…..

–కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలోని నీటి వనరులను పరిరక్షిస్తూ ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ పనితీరుపై అధికారులు, ఇంజినీర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో ఆక్రమణలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాలోని చిన్నతరహా నీటిపారుదల చెరువుల కట్టల పటిష్టతను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తూములు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలని తెలిపారు. అవసరమైన చోట మరమ్మతు పనులను గుర్తించి, వాటికి కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.

కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చి మొక్కలను తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలువల భూముల్లో ఆక్రమణలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి తొలగించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చే ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి, సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నీటి వనరుల నిర్వహణ, కాలువల పరిస్థితి, చెరువుల కట్టలు, తూముల పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

అధికారులు, ఇంజినీర్లు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పనుల పురోగతిని, నీటి వనరుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.