గోదావరి పుష్కరాల పనులను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలి..

Sakshitha news

గోదావరి పుష్కరాల పనులను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలి….

రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి….

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన భూమిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి….

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి//

గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, దేవాదాయ ఆలయాల అభివృద్ధి, భూసేకరణ, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పార్కింగ్, కేశఖండనం, అన్నదానం తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల కోసం ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, దేవాదాయ ఆలయాల అభివృద్ధి పనులతో పాటు భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.పుష్కరాల కోసం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులను సుమారు నాలుగు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.

మంథని ఆలయాల సమూహ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో 15 అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గౌతమేశ్వర, సురబాండేశ్వర, ఓంకారేశ్వర, త్రిబంధేశ్వర, మహాలక్ష్మి తదితర ఆలయాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనట్లు తెలిపారు.

ఇప్పటికే 10 పనులకు టెండర్లు ఖరారయ్యాయని, డిజైన్ ఆమోదాలు పూర్తయ్యాయని, అవసరమైన పత్రాల ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు. కాబట్టి క్షేత్రస్థాయిలో పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

శంకుస్థాపన కోసం పనులు నిలిపివేయాల్సిన అవసరం లేదని, శంకుస్థాపన కార్యక్రమం తరువాత నిర్వహించినప్పటికీ ముందుగా గ్రౌండ్ లెవల్ పనులను ప్రారంభించాలని స్పష్టం చేశారు.

అభివృద్ధి పనులు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో చేపట్టాలని సూచించారు. పనుల సందర్భంగా రహదారులు, తాగునీటి పైప్‌లైన్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నట్లయితే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. అవసరమైన విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని తెలిపారు.

గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ముందస్తుగా ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించే అవకాశం ఉన్నందున కేశఖండనం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్నదాన మండపాల ఏర్పాట్లను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

రోడ్ల అభివృద్ధి, ఆలయాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం తదితర పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినందున వాటిపై నిరంతరం ఫాలోఅప్ చేస్తూ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సాధారణంగా భూసేకరణ ప్రక్రియకు సుమారు 90 రోజుల సమయం పడుతుందని, అయితే పుష్కరాలకు తక్కువ సమయం ఉన్నందున స్థానిక రైతులతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్నేహపూర్వకంగా చర్చించి వారి సహకారం తీసుకోవాలని తెలిపారు. అవసరమైన భూమిని త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పార్కింగ్ కోసం అవసరమైన భూమిని రైతుల నుంచి తాత్కాలికంగా లీజుకు తీసుకోవాలని, సంబంధిత రైతులకు ఒక సీజన్ కౌలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఘాట్ల నిర్మాణానికి అవసరమైన భూమిని వెంటనే సంబంధిత శాఖలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఘాట్ల నిర్మాణానికి అవసరమైన భూమి ఇప్పటికే ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తయినందున స్థానిక రైతులతో సఖ్యతగా చర్చించి, ప్రజాప్రతినిధుల సహకారంతో భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూమికి సంబంధించిన చెల్లింపులు కూడా త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గోదావరిలో అవసరమైన నీటి లభ్యతకు సంబంధించి డీ-సిల్టింగ్ తదితర పనులను కూడా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఘాట్ల నిర్మాణ పనులకు అవసరమైన చర్యలను ముందుగానే పూర్తి చేసి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్య కారణంగా పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైన డిజైన్ మార్పులకు సంబంధించిన ఆమోదాల కోసం సంబంధిత శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అనుమతులను త్వరగా పొందాలని ఆదేశించారు.ఓదెల ఆలయ అభివృద్ధికి సంబంధించిన డిజైన్‌ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

మంథని పట్టణంలోని ఇతర అంతర్గత రోడ్ల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేయాలని తెలిపారు. ఈ పనులను వచ్చే సంవత్సరం చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఘాట్ల నిర్మాణం పూర్తయిన అనంతరం జనవరి చివరి లేదా ఫిబ్రవరి నుంచి ఘాట్ల సుందరీకరణ పనులను ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. తాగునీరు, మున్సిపల్ పారిశుధ్య పనులకు మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించేలా అవసరమైన పనులను ప్రతిపాదించి, త్వరగా చేపట్టాలని సూచించారు.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని, ప్రజాప్రతినిధుల సహకారంతో పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంథని ఆర్‌డీఓ సురేష్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఏ.డి.సుప్రియ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.