కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పాలనను ప్రశ్నించేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం దుర్మార్గం.: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పాలనను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ గండిమైసమ్మ సర్కిల్ కార్యాలయం వద్ద ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ప్రజల తరఫున ప్రశ్నించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
కేవలం నల్ల దుస్తులు ధరించారనే సాకుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు మాత్రమే కాకుండా ప్రజల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యత అని తెలిపారు.
ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST