అక్రమ పశువుల తరలింపుపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం….!
రెండు చోట్ల దాడులు.. 57 పశువులు, 5 వాహనాలు స్వాధీనం….
11 మంది అదుపులో.. 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం….
సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ టీమ్ అధికారులు కొరడా ఝుళిపించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిర్వహించిన తనిఖీల్లో రెండు వేర్వేరు ఘటనల్లో 57 పశువులను తరలిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు మహీంద్రా క్యాంపర్ వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మందమర్రి టోల్‌ప్లాజా వద్ద..
కౌటాల నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మూడు మహీంద్రా క్యాంపర్ వాహనాలను అడ్డుకుని తనిఖీ చేయగా 13 ఆవులు, 17 దూడలు కలిపి 30 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు డ్రైవర్లు, నలుగురు సహాయకులు కలిపి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాళ్లగురిజాలలో మరో ఘటన..
బెజ్జూర్ నుంచి జగిత్యాల జిల్లా రాజారాంపల్లి మార్కెట్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లగురిజాల గ్రామంలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడి నిర్వహించింది. రెండు మహీంద్రా క్యాంపర్ వాహనాలను తనిఖీ చేయగా 20 ఆవులు, 7 దూడలు కలిపి 27 పశువులు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకుని రెండు వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
11 మందిపై కేసులు నమోదు
రెండు ఘటనల్లో పట్టుబడిన మొత్తం 11 మంది నిందితులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న పశువులు, వాహనాలు, మొబైల్ ఫోన్లు, నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST