రామగుండం నియోజకవర్గంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత….

Sakshitha news

రామగుండం నియోజకవర్గంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత….

పాలకుర్తి ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో ఎకరం విస్తీర్ణంలో డెమో ఫీల్డ్‌ ఏర్పాటు….

రైతులకు దీర్ఘకాలిక ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలి…

— ఎమ్మెల్యే మాకన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పాలకుర్తి/ : రామగుండం నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించేందుకు చర్యలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మాకన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. పాలకుర్తి మండలంలో నూతనంగా నిర్మించిన ఎంఆర్ఓ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై అవగాహన కల్పించేందుకు, కార్యాలయాన్ని సందర్శించే రైతులకు సాగు విధానాలను ప్రత్యక్షంగా వివరించాలనే ఎమ్మెల్యే సూచన మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలో ఒక ఎకరం విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ డెమో ఫీల్డ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా రైతులకు లభించే దీర్ఘకాలిక ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాగు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ గడ్డం శ్యామ్‌ ప్రసాద్‌ను ఆదేశించారు.

జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ గడ్డం శ్యామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ ఎఫ్‌ఎఫ్‌బీఎస్‌ (FFBs) ధర ప్రస్తుతం రూ.24,025కు పెరిగిందని తెలిపారు. ఆయిల్‌పామ్‌ చరిత్రలో ఇప్పటివరకు ప్రకటించబడిన అత్యధిక ధర ఇదేనని పేర్కొన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో రైతులు ఆయిల్‌పామ్‌ సాగు వైపు మరింతగా ఆకర్షితులై, దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.

రామగుండం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ఉద్యాన శాఖ తరఫున అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, రైతులకు అవగాహన కార్యక్రమాలు, సాగు ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), ఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి, తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఏసీపీ రామగుండం తదితర అధికారులు పాల్గొన్నారు.