మహిళా రిజర్వేషన్‌ను 2023 చట్టం ప్రకారం ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే అమలు చేయాలి

Sakshitha news

మహిళా రిజర్వేషన్‌ను 2023 చట్టం ప్రకారం ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే అమలు చేయాలి

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ ఈ రోజు గాంధీభవన్ లో మహిళా ఆరక్షన్ బిల్ ఆజ్ కరో అభి కరో అనే నినాదంతో పోస్ట్ కార్డు పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి PMO ఆఫీస్ కి పంపించడం జరిగింది.

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ..

పార్లమెంట్ 2023 సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన “నారీ శక్తి వందన్ అధినియమ్ 2023″ను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి.

మహిళా రిజర్వేషన్ కోసం కొత్త జనగణన, డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా 2023 చట్టాన్ని ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లకు వర్తింపజేసి, 2029 సార్వత్రిక ఎన్నికల నుండే 33% సీట్లు మహిళలకు కేటాయించాలి.

మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర. కుల గణన లేకుండా ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నాన్ని మేము అంగీకరించం. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకం.

2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సీట్ల ప్రకారం అమలు చేసేందుకు కేంద్రం ఏ సవరణలు తీసుకొచ్చినా ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుంది.

33% రిజర్వేషన్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సబ్-కోటా కల్పించాలి. సామాజిక న్యాయం లేని రిజర్వేషన్ అసంపూర్ణం.

మహిళా సాధికారత విషయంలో మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాటలు చెప్పి మోసం చేయడం, “తమాషా” చేయడం మానేసి, ఆమోదం పొందిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. 2023 చట్టం కోసం మరో 5-10 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు.

దేశ మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రస్తుత 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు కేటాయించి 2029 ఎన్నికలను నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.

బీజేపీ స్వార్థం కోసమే మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టింది

2023 సెప్టెంబర్‌లోనే నారీ శక్తి వందన్ అధినియమ్ ఆమోదం పొందినా, దాన్ని వెంటనే అమలు చేయకుండా జనగణన, డీలిమిటేషన్ పేరుతో 10 ఏళ్లు వాయిదా వేయడం బీజేపీ దురుద్దేశాన్ని బయటపెడుతోంది.

కుల గణన జరిగితే ఓబీసీల వాస్తవ సంఖ్య బయటపడుతుందని, సామాజిక న్యాయం కోసం డిమాండ్ పెరుగుతుందని బీజేపీ భయపడుతోంది. అందుకే కుల గణన లేకుండా డీలిమిటేషన్ చేసి, ఎన్నికల మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.

మోదీ గ్యారంటీ అని చెప్పి మహిళలను మోసం చేసింది బీజేపీనే. బిల్లు పాస్ చేశామని చెప్పుకుంటూ, అమలు మాత్రం చేయకుండా మహిళల ఆకాంక్షలతో ఆటలాడుకుంటోంది.

బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మహిళా సాధికారతను తాకట్టు పెట్టడాన్ని దేశం గమనిస్తోంది.

మహిళలకు న్యాయం జరగాలంటే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన నిలబడుతుందని అన్నారు.