వసతులు అడిగితే దూషిస్తారా…?
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థినిలపై ఎస్పీ అనుచిత వ్యాఖ్యలు….
క్షమాపణ చెప్పాలని డా. మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి// ఎన్టీపీసీ: బాసర ట్రిపుల్ ఐటీలో వసతుల సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినిలపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విద్యార్థినులను అవమానించేలా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థినులు మెరుగైన ఆహారం, వసతి వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్న తరుణంలో, వారిని “సిగ్గులేని బతుకులు” అంటూ దూషించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు విద్యార్థినిల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ ఘటనపై సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా స్పందించారు. ఉన్నత హోదాలో ఉన్న అధికారి ఈ విధంగా విద్యార్థినిలను అవమానించడం ఖండనీయం అని పేర్కొన్నారు. “తినడానికి తిండి, ఉండడానికి వసతి లేకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారు..? సమస్యలు చెప్పుకుంటే అవమానించడమేనా..?” అని ప్రశ్నించారు.
సంబంధిత అధికారిపై తక్షణమే చర్యలు తీసుకుని, బాధిత విద్యార్థినులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డా. దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని పలు వర్గాలు కోరుతున్నాయి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY