ఇంటిస్థలాల సాధనకు జర్నలిస్టుల్లో చొరవ చూపేదెవరు?
నిజాంపేట, పేట్ బషీర్ బాద్ లో జర్నలిస్టులకోసం కేటాయించిన భూముల్లో ఇంటి స్థలాలను ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు వివాదంలో భూముల జోలికి వెళ్లకుండా సజావుగా ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో వివాదానికి సంబంధంలేకుండా జర్నలిస్టులకు ఇంటిస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటిస్థలాలకోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు
(01) జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ
(02) జర్నలిస్ట్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ
(03) డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ
(04) తెలంగాణ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ
జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి సీఎం రేవంత్ రెడ్డి భూములను కేటాయించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖరీదైన భూములను జర్నలిస్టులకు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి.
దీంతో జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూముల్నో ఇంటిస్థలాల విభజన ప్రక్రియ స్తంభించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల పేరుతో ఇంటి స్థలాలకోసం భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు.
అందుకే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల పేరుతో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసేవారిని పెద్దగా పట్టించుకోవడంలేదు.
జర్నలిస్టులకు హామీ ఇచ్చిన ప్రకారం… కోర్టు తీర్పులతో సంబంధంలేకుండా కొత్తగా ఏర్పాటుచేయనున్న ఫ్యూఛర్ సిటీలో ఇంటిస్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు.
దీనికి అనుగుణంగా డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన వెలువడిన మరుసటిరోజే ఫ్యూచర్ సిటీ స్థావరంలో సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాలనే ఉద్ధేశంతో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కొత్త అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధి సూరజ్ భరద్వాజ, సీనియర్ జర్నలిస్టులతో కలిసి ఇంటి స్థలాల విషయమై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఇచ్చిన మాటప్రకారం జర్నలిస్టులకు ఇంటిస్థలాలను ఫ్యూచర్ సిటీలో ఇస్తామని చెప్పారు. ఏదో ఒక జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధంలేకుండా అన్ని సొసైటీలను ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి జాబితా ఇస్తే… దాని ప్రకారం ఇంటిస్థలాలను ఇబ్బంది లేకుండా ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సమాచార, ప్రజాసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలు ముందుకురావాల్సి అవసరం ఉంది.
ప్రభుత్వ నిర్ణయానుసారం సొసైటీలతో సంబంధలేకుండా… జర్నలిస్టు ప్రతినిధులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది.
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు మీడియా అకాడమీ ఛైర్మన్ ప్రయత్నించాల్సి ఉంటుంది.
మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని, జర్నలిస్టు హౌసింగ్ సొటీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, ఉమ్మడి జాబితా సిద్ధం చేయాల్సి ఉంటుంది.
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు కలిసి మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమై ఒక ఉమ్మడి జాబితాను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఉమ్మడి జాబితా ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, అధికార యంత్రాంగం ఇళ్లస్థలాల కేటాయింపు ప్రక్రియ మొదలుపెడుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి తన హయాంలోనే ఇంటి స్థలాలు ఇవ్వాలనే ఉద్ధేశంతో ఉన్నారు. జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల ప్రతినిధులు ముందుకొచ్చి ఉమ్మడి జాబితా సమర్పిస్తే రెండేళ్లలో శుభవార్త వినగలమనే విశ్వాసం ఉంది.

