ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం….
–మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్‌లోని సప్తగిరి కాలనీ, రాజ్యలక్ష్మీ కాలనీ, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కాలువల్లో పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులను పరిశీలించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ, గతంలో ప్రతి వర్షాకాలంలో ఈ డివిజన్ వరద ముంపుకు గురయ్యేదని, ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హామీ మేరకు కాంక్రీటు వరద కాలువ నిర్మాణం చేపట్టడంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు.
రాజ్యలక్ష్మీ కాలనీలో ప్రధాన రహదారి నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టి బురద సమస్యను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. డివిజన్‌లోని సమస్యలను దృష్టిలో ఉంచుకుని రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మెడికల్ కళాశాలకు వెళ్లే రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారిందని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే ప్రధాన రహదారి పక్కన వరద కాలువ నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీకాంత్, పట్టణ ప్రణాళిక అధికారి నవీన్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రారెడ్డి, వార్డు అధికారి శ్రావణి, నాయకులు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
