టీటీడీలో అన్య మతస్థులపై తక్షణ నివేదిక

Sakshitha news

టీటీడీలో అన్య మతస్థులపై తక్షణ నివేదిక

** రుచికర అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు

** అధికారుల సమీక్షలో ఈవో అనిల్ కుమార్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ విభాగాల్లో ఇంకనూ ఎవరైనా అన్యమతస్థులు ఉంటే తక్షణం ఆ నివేదికను ఆయా హెచ్ఓడీలు తమకు పంపాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాలు తయారుచేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణిని పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

టీటీడీ ఆలయాల్లో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారి నివేదికను తయారు చేయాలన్నారు. తిరుమల తరహాలోనే టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని తెలిపారు. ఇంకనూ ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కొరకు నివేదిక తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు, ఇతర ఆలయాల్లో ఏఏ ఆలయాలకు వేద పారాయణ దారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై కూడా సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని సూచించారు. పోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక, పాచిక పేర్లుగా మార్పు చేయాలన్న టీటీడీబోర్డు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టీటీడీలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.

అమరావతి ఆలయంపై ప్రత్యేక దృష్టి…

అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి మురళీకృష్ణ, సీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top