మహిళా సంఘాలకు శిక్షణ

Sakshitha news

మహిళా సంఘాలకు శిక్షణ మున్సిపల్ కమిషనర్ హాజరు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో కచ్చపి ఆడిటోరియంలో మహిళా సంఘాలలోని స్టార్ పెర్ఫార్మర్ మహిళలకు “లీప్” విభాగం ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక కుటుంబం – ఒక వ్యాపారస్థుడు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘంలో ఒకరిని వ్యాపారస్థుడిని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మెప్మా ఎం.ఎస్.ఎం.ఈ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పెర్ఫార్మెర్స్ గా గుర్తించడం జరిగిందని అన్నారు. వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా రిటైల్, టెక్స్‌టైల్స్, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, ఫర్నిచర్ అండ్ ఉడ్ ప్రొడక్ట్స్ వంటి వాటిలో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుండి గ్లోబల్ స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, సెక్టార్-నిర్దిష్ట చర్చలు, నిపుణుల మెంటర్‌షిప్ అందించబడుతుందని తెలిపారు. అలాగే ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జెమ్ రిజిస్ట్రేషన్, ఐటీ అండ్ కంప్లయన్సెస్, క్వాలిటీ అండ్ ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్, మార్కెట్ యాక్సెస్ (ఆన్‌లైన్ – ఆఫ్‌లైన్), ఐపిఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్.యు.ఎల్.ఎం. డైరెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ మహిళలతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు.
లీప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భవ్య శర్మ, ప్రాజెక్ట్ హెడ్ షీలా శ్రీనివాస్ లు ప్రాజెక్టులు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, పథక సంచాలకులు రాఘవ రెడ్డి, సి.ఎం.ఎం.లు కృష్ణవేణి, సోమ కుమార్, లతో పాటు మహిళలు పాల్గొన్నారు. స్టార్ పెర్ఫార్మర్లకు సర్టిఫికెట్స్ అందజేశారు.