మహిళ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ఆస్తి కోసం అక్కను హతమార్చిన తమ్ముడు : డీఎస్పీ ప్రసన్నకుమార్
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో సంచలనం రేపిన మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదమే హత్యకు కారణమని సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్సై ఐలయ్యతో కలిసి డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామానికి చెందిన సురభి సైదులు తన అక్క సురభి అంజమ్మను పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. భూ వివాదం కారణంగా సైదులు, అతని కుటుంబ సభ్యులు అంజమ్మతో విభేదాలు పెంచుకున్నారని చెప్పారు. అంజమ్మను తొలగిస్తే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించిన సైదులు, ఈ నెల 18వ తేదీ ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అంజమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు వివరించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురభి సైదులు (45), అతని భార్య ధనలక్ష్మి (40), కుమారుడు శివతేజ (20)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు కొండ భీమయ్య పరారీలో ఉండగా, అతడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసులో సైదులు కుటుంబం ముందుగానే కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైందన్నారు. గతంలో కూడా భూమి వివాదంపై అంజమ్మ, ఉమపై దాడి చేసిన కేసు నమోదు కాగా, అది ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతుందని చెప్పారు. భూమి, ఆస్తి వివాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని, వ్యక్తిగతంగా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
