అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి….
— మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం నగరంలో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి పనులను నగర మేయర్ మహంకాళి స్వామి గురువారం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు దృష్టికి తీసుకువచ్చిన పలు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రశాంత్‌నగర్‌లో డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిశీలించిన మేయర్, అక్కడ సెంట్రల్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీతో పాటు రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే శ్రీనగర్ కాలనీలో అత్యవసరంగా కల్వర్టు నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.
అమృత్ జలాశయాల పునరుజ్జీవన పథకంలో భాగంగా మల్కాపూర్ చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అవసరమైన యంత్రాలు, కార్మికులను అధిక సంఖ్యలో వినియోగించి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి న్యూ పోర్ట్‌పల్లిలో స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వడ్లూరి రవి, వెంగళబాపు, నాయకులు భరత్ గౌడ్, అభిషేక్, నగరపాలక సంస్థ టీపీఎస్ నవీన్, ఏఈ తేజస్విని, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ఏఈలు మౌనిక, మనోజ్, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి కృపాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
