పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న నిధులను జూన్ 30 లోపు పూర్తిస్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
ఉదయం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాకు ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ.19 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, ఈ నిధులను జూన్ 30లోపు పూర్తిగా ఖర్చు చేయడం లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు.
ప్రణాళిక చేసిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు అవసరమైన కొత్త పనులను కూడా వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, వీఓ భవనాలు, కల్వర్టులు తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.
పనుల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
జిల్లాకు కేటాయించిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించి, నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టే పనులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడటంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి పనిని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసి నిధుల వినియోగంలో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ శంకరయ్య , డి.ఈ.లు, ఏఈ లు,ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
