కాంగ్రెస్ హామీలు గాలికొదిలి.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

Sakshitha news

కాంగ్రెస్ హామీలు గాలికొదిలి.. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

–టీయూసీఐ…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ విమర్శించారు.

రామగుండం డివిజన్ పరిధిలోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వివిధ సెక్షన్ల వద్ద ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోకల రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలకు శాస్త్రీయత లేదని, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాల పెంపు జరగలేదని, వేతనాల పెంపు గోరంతగా ఉండగా ధరల పెరుగుదల కొండంతగా ఉందని పేర్కొన్నారు. ఈ వేతనాల పెంపు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అమలయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఒక్క పైసా వేతనాన్ని కూడా పెంచలేదని విమర్శించారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.

సింగరేణి ప్రాంతంలోని వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలకు పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని, సింగరేణి వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు, దీర్ఘకాలిక సమ్మెలకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశాల్లో ఆల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ శనగల శ్రీనివాస్, యూనియన్ నాయకులు పులిపాక రాజేందర్, ఎర్రల సారయ్య, కొయ్యడ వెంకటేష్, గుండ్ల పోశం, గొట్టే లక్ష్మీనారాయణ, వసంత విజయ, టి.శంకర్, ఎం.రాజయ్య, వేణు, శివారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top