రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది

Sakshitha news

రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది

** మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: రాష్ట్ర అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులకు ఎంతటి కీర్తిప్రతిష్ఠలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అదే స్థాయిలో గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. “రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు విడుదల చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా రూ.3,175 కోట్లు జమ చేశాం. ఇప్పుడు రెండో విడతతో కలిపి మొత్తం రూ.6,310 కోట్లను అన్నదాతలకు అందించాం.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైంది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రైతు సంక్షేమంపై మా చిత్తశుద్ధికి ఈ నిధుల విడుదలే నిదర్శనం”.

పంచ సూత్రాలతో వ్యవసాయ ప్రగతి

వ్యవసాయ రంగం అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం ఐదు కీలక సూత్రాలతో పనిచేస్తోంది.
“నీటి భద్రత, ప్రకృతి సేద్యం, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహాయం అనే పంచ సూత్రాలతో రైతే రాజుగా ఉండే రాష్ట్రాన్ని నిర్మిచడమే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు. అందులో భాగంగా నీరు సమృద్ధిగా ఉన్నచోటే అభివృద్ధి సాధ్యం. రాయలసీమ కష్టాలు మా సీఎంకు తెలుసు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరందించాం. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను సీమకు తరలించి జలాశయాలు నింపాం. భూగర్భ జలాలు పెంచడం వల్ల ఒకప్పుడు 100 అడుగుల లోతులో ఉన్న నీరు, ఇప్పుడు 7.3 మీటర్లకే అందుబాటులోకి వచ్చింది.

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది”
ముఖ్యంగా ప్రకృతి సేద్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రైతులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి. రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతుండగా, మరో 6 లక్షల ఎకరాలను దీని పరిధిలోకి తెస్తున్నాం. దేశంలోనే 18 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. పంజాబ్‌లో అధిక ఎరువుల వాడకంతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ పరిస్థితి మనకు రాకూడదు” అని హితవు పలికారు. సాగులో డ్రోన్లు, శాటిలైట్ల వినియోగాన్ని పెంచుతాం. రాయలసీమలో డ్రోన్, స్పేస్ సిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా భూసార పరీక్షలు, వాతావరణ మార్పులు, పంటల డిమాండ్ వంటి వివరాలను రైతులకు అందిస్తాం. టెక్నాలజీతో పెట్టుబడి వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు 100శాతం రాయలసీమ-ప్రకాశం జిల్లాల్లో 90శాతం, కోస్తాలో 70శాతం సబ్సిడీని పునరుద్ధరించాం” అని సురేంద్ర కుమార్ వివరించారు.

Scroll to Top