ప్రతి నెల 100కు పైగా మొబైల్స్ రికవరీ చేస్తున్న సూర్యాపేట పోలీసులు

Sakshitha news

ప్రతి నెల 100కు పైగా మొబైల్స్ రికవరీ చేస్తున్న సూర్యాపేట పోలీసులు

సాక్షిత : ఈ సంవత్సరం రూ.7.15 కోట్ల విలువైన 842 మొబైల్స్‌ను బాధితులకు అందజేసిన ఎస్పీ నరసింహ
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రోజున సెల్‌ఫోన్ రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాలలో పోయిన 102 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడం మరియు బాధితులకు జిల్లా ఎస్పీ కె. నరసింహ (IPS) చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇప్పటివరకు 6వ దఫా మొబైల్ రికవరీ మేళా నిర్వహించామని, మొత్తం రూ.7 కోట్ల 15 లక్షల విలువైన 842 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. సూర్యాపేట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఇతర రాష్ట్రాల వరకు వెళ్తూ ఈ మొబైల్స్‌ను గుర్తించారని ఆయన వివరించారు. నేటి సమాజంలో మొబైల్ ఫోన్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ఇందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, సోషల్ మీడియా పాస్‌వర్డ్లు వంటి కీలక డేటా ఉంటుందన్నారు. “మొబైల్ పోతే కేవలం ఫోన్ మాత్రమే కాదు, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక డేటా కూడా పోతుంది,” అని హెచ్చరించారు.

మొబైల్ చోరీలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) CEIR పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపిన ఎస్పీ, ప్రజలు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే https://www.ceir.gov.in లో నమోదు చేసి ఫోన్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్స్‌ కొనుగోలు చేసే వారు షాప్ యజమానుల నుండి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి“అధిక వడ్డీ వస్తుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఎవరి మాటలకీ మోసపోవద్దు,” అని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కొందరు సైబర్ మోసగాళ్లు CBI, CID పేర్లు చెప్పి డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు అని వివరిస్తూ, “డిజిటల్ అరెస్ట్ అనే విషయం అసలే లేదు, ఇది మొత్తం మోసం,” అని ఆయన స్పష్టంగా చెప్పారు.“ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్”ప్రజల సహకారమే నేర నియంత్రణకు బలమని ఎస్పీ చెప్పారు. “మీరు నివసించే ప్రాంతాల్లో జరిగే అసాంఘిక చర్యలపై మాకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. పోలీసులకు మిత్రులుగా ఉన్న ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసు,” అని పిలుపునిచ్చారు. సైబర్ మోసాలు, డ్రగ్స్, అక్రమ రవాణా వంటి సమస్యల నివారణలో ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని సూచించారు.
బాధితుల కృతజ్ఞతలు

తమ పోయిన ఫోన్లు తిరిగి లభించలేవని భావించిన బాధితులు, సూర్యాపేట జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్లు తిరిగి అందించినందుకు జిల్లా ఎస్పీ నరసింహ కి మరియు పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఇక కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.