ప్రజావాణి అర్జీదారులకు వేసవి ఉపశమనం….
– కలెక్టరేట్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ ప్రారంభం….
సాక్షిత పెద్దపల్లి :
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఉపశమనం కలిగించేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ప్రారంభించారు.
జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ డి. వేణు, డీసీపీ రామ్‌రెడ్డి లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దూర ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు ఎండ తీవ్రత వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు.
అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మిషన్ వాత్సల్య – బాలల పరిరక్షణ సేవలు” స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
బాలల హక్కుల రక్షణ, అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా స్పాన్సర్‌షిప్, పిల్లల దత్తత వంటి అంశాలపై అర్హులకు సరైన సమాచారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ జి. కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY