పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు – గోరక్షణ పేరుతో హింసకు నో…..
–పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా…
…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఆవులు, దూడల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, వ్యక్తిగత దాడులకు పాల్పడడం నేరమని హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, హిందూవాహిని, శ్రీరామ్ సేన, హిందూ యువవాహిని సభ్యులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పశువుల రవాణా నిబంధనలు, పోలీస్ శాఖ చర్యలు, జాగ్రత్తలపై వివరించారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలపాటు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచుతున్నట్లు చెప్పారు.
పశువుల అక్రమ రవాణా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, కౌ స్లాటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గోరక్షకుల పేరుతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, నిర్ధారించకుండా పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597, డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.
ప్రజల ప్రశాంత జీవనం, సామాజిక సామరస్యం, మూగజీవాల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తోందని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కె. శ్రీనివాస్, ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY