ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచండి,
డిజిటలైజేషన్‌లో లోపాలు వెంటనే సరిదిద్దాలి…
సంక్షేమ పథకాలకు ఓటరు జాబితాకు సంబంధం లేదని ప్రజలకు స్పష్టం చేయాలి….
— రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. బీఎల్‌వోలు నమోదు చేసిన వివరాలను ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేసి, అన్ని లోపాలను మరో రెండు రోజుల్లోగా సరిదిద్దాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతి, ఓటర్ల వివరాల డిజిటలైజేషన్, డేటా నమోదు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలను సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ శ్రీరాములు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ఓటర్ల నుంచి సేకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే డిజిటలైజ్ చేయాలని సూచించారు. బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
అందువల్ల బీఎల్‌వోలు నమోదు చేసిన ప్రతి వివరాన్ని ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్ వెరిఫై చేయాలని, యాదృచ్ఛికంగా ఓటర్ల వివరాలను పరిశీలించి అన్ని లోపాలను రెండు రోజుల్లోగా సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం తప్పిదాలు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉందని, సూపర్‌వైజర్లు బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 శాతం, మరో 80 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తైందని వెల్లడించారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఖండించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
అలాగే రాజకీయ పార్టీలతో తరచూ సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ పురోగతిని వివరించాలని, పోలింగ్ స్టేషన్‌ల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను బూత్ లెవల్ ఏజెంట్లకు అందజేసి వారి సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

