సింగరేణి “మారు పేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యను పరిష్కరించి మాకు ఉద్యోగాలివ్వాలి….
….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: సింగరేణి సంస్థలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ‘మారు పేర్లు’ ‘విజిలెన్స్ పెండింగ్’ కేసుల వల్ల వందలాది మంది కార్మికుల పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికుల పిల్లలు డిమాండ్ చేశారు.
రామగుండం ఆర్ జి -1 ఏరియాలోని 1 & 3 ఇంక్లైన్ గనుల వద్ద వాల్ పేపర్ స్టిక్కరింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ, తమ ఆవేదనను కార్మికులకు వివరించారు.
మా తండ్రులు భూగర్భ గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను కాపాడారు. కానీ నేడు “మారు పేర్లు”విజిలెన్స్’ అనే సాంకేతిక కారణాలతో మాకు రావలసిన వారసత్వ ఉద్యోగాలు రాక, మేము రోడ్డున పడ్డాము” అని కార్మికుల పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.
గనుల వద్ద పని ముగించుకుని వస్తున్న కార్మికులు పిల్లల బాధను చూసి చలించిపోయారు. “తమ్ముడూ.. మీరు చింతించకండి, మేము మీకు ఎప్పుడూ అండగా ఉంటాము. మనమందరం కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దాం” అని కార్మికులు వారికి భరోసా ఇచ్చారు.
- ముఖ్యమంత్రి హామీ ఏమైంది..? గతంలో భూపాలపల్లి సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఆ హామీని తక్షణమే నెరవేర్చాలని వేడుకున్నారు.
- 11 ఏరియాల్లో నిరసన ఈ పోరాటం కేవలం రామగుండంకే పరిమితం కాదని, సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఈ వాల్ పేపర్ స్టిక్కరింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
“ప్రభుత్వం దయతలిచి మాకు రావాల్సిన ఉద్యోగాలు త్వరగా ఇచ్చి, మా కుటుంబాలను ఆదుకోవాలని సింగరేణి కార్మికుల బిడ్డలుగా మేము వేడుకుంటున్నాము” అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్, డిష్ బాబు, దనాడ రాజు, సదానందం, ఓం ప్రకాష్, సందీప్, శేఖర్, విజయ్, దొడ్ల కుమార్, అంజయ్య, భారీ సంఖ్యలో కార్మికులు, వారి పిల్లలు పాల్గొన్నారు.

