డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి… ఆరోగ్యకరమైన జీవితానికి ‘యెస్’ చెప్పండి….
–జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…
డ్రగ్స్, గంజాయి రహిత మంచిర్యాలే లక్ష్యం – ప్రజల సహకారం కీలకం….
–డీసీపీ ఎ. భాస్కర్…
…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: మంచిర్యాల, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ యాంటీ డ్రగ్స్ అవగాహన 2కే రన్ నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ పర్యవేక్షణలో, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, యువత, పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మంచిర్యాలను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు బానిసైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 13వ. బెటాలియన్ కమాండెంట్, ఏసీపీ ఆర్. ప్రకాష్, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
