దేశవ్యాప్త ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
అశ్వారావుపేట సాక్షిత :
కేంద్ర ప్రభుత్వ రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టబోయే ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె ఎం) అశ్వారావుపేట మండల సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా మండల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ ఐ పి కే ఎం ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్ అధ్యక్షతన వహించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అఖిలభారత రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కిరపాటి పుల్లయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు జి. రామకృష్ణ, అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కంగాల కల్లయ్య తదితరులు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల రద్దు: మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో భారతీయ రైతాంగాన్ని నిలువునా ముంచుతోందని మండిపడ్డారు. విదేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేబర్ కోడ్ల ఉపసంహరణ: కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. దీనివల్ల కార్మికుల హక్కులను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టారని విమర్శించారు.
ఉపాధి హామీ పథకం పరిరక్షణ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజిఎన్ఆర్ఇజిఎ) నిధుల కోతతో అస్తవ్యస్తం చేస్తూ, క్రమంగా ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులు: రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం సి2 + 50\% పద్ధతిలో కనీస మద్దతు ధరను (ఎం ఎస్ పి) చట్టబద్ధం చేసి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు
ఈ సమన్వయ కమిటీ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, సిపిఎం జిల్లా నాయకులు బి. చిరంజీవి, పిట్టల అర్జున్, సిపిఐ నాయకులు ఉగ్గల అర్జున్, పి వై ఎల్ డివిజన్ కార్యదర్శి బాడిస లక్ష్మణరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కంగాల వెంకటేష్, కారం రాజులు, వాసం పోతురాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


