వర్షాల వేళ విద్యార్థుల భద్రతే తొలి ప్రాధాన్యం….
పాఠశాలల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, : వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎస్)లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్ఎస్ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పాములు, తేళ్లు, దోమలు, ఈగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుని విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.
తరగతి గదులు, వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీటిని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా పరీక్షించి, విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మండల, గ్రామస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి డిజిటల్ విద్యా వనరులను సమర్థంగా వినియోగించి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంపొందించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) నమోదు వంద శాతం పూర్తి చేయాలని, విద్యార్థుల హాజరు, విద్యా పురోగతి, ఆరోగ్యం, భద్రత, క్రమశిక్షణ అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్ తమ విద్యాసంస్థల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఈవో శారద, జీసీడీఓ కవిత, మల్లేశం, సంబంధిత శాఖల అధికారులు, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ, యూఆర్స్ స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
