60 ఏళ్లు దాటిన నిర్మాణ కార్మికులకు రూ.9 వేల పెన్షన్ ఇవ్వాలి….
చలో హైదరాబాద్‌కు టియుసిఐ పిలుపు…
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు కనీసం రూ.9 వేల పెన్షన్ అందించాలని టియుసిఐ నాయకులు డిమాండ్ చేశారు.
గోదావరిఖనిలోని ఓల్డ్ అశోక టాకీస్ లేబర్ అడ్డా వద్ద టియుసిఐ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కరపత్రాలు పంచి, గోడ పత్రికను విడుదల చేసి గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టియుసిఐ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, రాష్ట్ర నాయకులు ఆడెపు శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందడం లేదన్నారు. అనేక మంది కార్మికులకు బి ఓ సి కార్డులు లేకపోవడం, కార్డులు ఉన్నవారు రెన్యువల్స్ చేసుకోలేకపోవడం, క్లెయిమ్స్ సక్రమంగా అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
నిరక్షరాస్యులైన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు సులభంగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత కార్మికులకు కార్డు ఉపయోగపడకపోవడం బాధాకరమన్నారు. ఎన్నో కష్టాలు పడుతూ భవనాలు, ప్రాజెక్టులు నిర్మిస్తున్న కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేకపోవడం అన్యాయమని విమర్శించారు.
అదేవిధంగా డెలివరీ, మ్యారేజ్ గిఫ్ట్, సహజ మరణం వంటి సంక్షేమ పథకాల ఆర్థిక సహాయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న నిర్వహించే “చలో హైదరాబాద్” కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, జిల్లా కోశాధికారి ఇనగాల రాజేశ్వర్, కలువల రాజమల్లు, యాదగిరి, రాజయ్య, నాని, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

