ప్రైవేటు పాఠశాలల దోపిడీ.. తనిఖీలు చేసి కేసులు పెట్టాలి: రమేష్

Sakshitha news

ప్రైవేటు పాఠశాలల దోపిడీ.. తనిఖీలు చేసి కేసులు పెట్టాలి: రమేష్

సాక్షిత వనపర్తి :
జిల్లాలో ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తనిఖీలు చేసి పాఠశాలల దోపిడిని అరికట్టాలని డీఈఓ ఆఫీస్ సూపరిండెంట్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఎల్కేజీ కి రూ. 20వేల నుంచి రూ. 40 వేలు, ఆరవ తరగతి నుంచి 10 వరకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వసూలు చేస్తున్నారన్నారు. వేర్వేరు కంపెనీల పేరు చెప్పి పాఠ్యపుస్తకాలను పాఠశాలల్లో అధిక ధరలకు విద్యార్థులకు అంటగడుతున్నారని, పాఠశాల యూనిఫారాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.

పలు పాఠశాలలకు అనుమతులు లేవని, ప్రభుత్వం నిర్దేశించిన సౌకర్యాలు క్రీడామైదానాలు గదులు లేకున్నా ఫీజులు మాత్రం తగ్గించటం లేదన్నారు. పాఠశాలలను డీఈవో తనిఖీ చేసి దోపిడీ చేస్తున్న పాఠశాలలపై కేసులు పెట్టాలన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేయకుండా ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఫీజుల పట్టికను పెట్టాలని జిల్లా కలెక్టర్ ఫీజులను నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోపిడీ ఇలాగే కొనసాగితే విద్యార్థులను సమీకరించి పాఠశాలల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశీ, ఉదయ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top