వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారిపై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ… జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై ఆధారాలతో సహా లోకాయుక్త లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
యంత్రాలు, విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు సైతం బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఆయనపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు.
తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయిస్తూ…నిబంధనలను పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
అధికారి అవినీతికి సహకరిస్తున్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్లు తెలిపారు.
కొంత మంది అధికారుల చర్యల కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
