గంజాయి నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం కీలకం…
డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన డిసిపి.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచన…
–డిసిపి ఏ. భాస్కర్..
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ సెంటర్‌ను శుక్రవారం ఆయన, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా డి-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకులతో డిసిపి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చికిత్స విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు 15 రోజుల పాటు డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఇక్కడ వైద్య చికిత్సతో పాటు మానసికంగా మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు మంచిర్యాల జోన్ పరిధిలో 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలిన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు పంపించినట్లు వెల్లడించారు.
గంజాయి సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అలాగే గంజాయి సేవించే వారిని గుర్తించి వారికి చికిత్స అందించడం ద్వారా మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు తమ పరిసరాల్లో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారని, అవసరమైతే డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తామని తెలిపారు. అయితే చికిత్స అనంతరం కూడా మళ్లీ మత్తు పదార్థాలకు అలవాటు పడి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
నిపుణులైన వైద్యుల సహాయంతో మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు తిరిగి సాధారణ జీవితంలోకి రావడం సాధ్యమేనని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత మంచిర్యాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డిసిపి ఏ. భాస్కర్ పిలుపునిచ్చారు.

