ఎండల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ
ఉదయం 11 గంటలకే విధులు ముగించాలి…..
– రామగుండం మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారి పని వేళలను సవరించినట్లు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 11 గంటలకల్లా తమ విధులను ముగించాలని సూచించారు.
ఇటీవల జిల్లాలో వడదెబ్బ కారణంగా ప్రజలు అస్వస్థతకు గురికావడం, మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మేయర్ తెలిపారు. ఈ మేరకు పారిశుద్ధ్య సిబ్బంది ఉదయం 4 గంటలకు విధులకు హాజరై ఉదయం 11 గంటల వరకు మాత్రమే పనిచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
విధుల నిర్వహణ సమయంలో కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తరచూ నీరు తాగుతూ ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎండల తీవ్రత తగ్గే వరకు ఈ ప్రత్యేక పని వేళలు అమల్లో ఉంటాయని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు నగర పాలక సంస్థ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

