నకిలీ పత్తి విత్తనాల ముఠాపై పోలీసుల ఉక్కుపాదం…

Sakshitha news

నకిలీ పత్తి విత్తనాల ముఠాపై పోలీసుల ఉక్కుపాదం…

భీమారంలో 316 కిలోల నకిలీ విత్తనాల స్వాధీనం – ఒకరు అరెస్ట్, ఇద్దరు పరార్…


సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల విక్రయంపై పోలీసులు భారీ దాడి నిర్వహించి ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుడి ఇంటి నుంచి సుమారు రూ.9.48 లక్షల విలువైన 316 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, భీమారం గ్రామంలోని ఇప్పల బోగడ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్రభుత్వం నిషేధించిన నకిలీ పత్తి విత్తనాలను తన ఇంట్లో నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో భీమారం ఎస్‌ఐ ఏ.రాజేందర్, మండల వ్యవసాయ అధికారి సుధాకర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. తనిఖీల్లో 7 సంచుల్లో నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి.

అరెస్ట్ అయిన నిందితుడు పెనుకుల రవి (40), భీమారం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. గత సంవత్సరం నుంచే పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులతో కలిసి నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. రైతులను అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి కిలోకు రూ.3,000 చొప్పున విక్రయించినట్లు తెలిపాడు.

ఇటీవల 150 కిలోల విత్తనాలను విడతల వారీగా ఆటోలో తరలించి విక్రయించగా, మరో 200 కిలోల విత్తనాలను ట్రాన్స్‌పోర్ట్ ద్వారా తెప్పించినట్లు వెల్లడించాడు. రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు.
నకిలీ ఎచ్ టి (బి టి 3) పత్తి విత్తనాల వినియోగం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, లైసెన్సు పొందిన దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు తీసుకుని రసీదులు భద్రపరచుకోవాలని సూచించారు.

రవాణా ద్వారా నకిలీ విత్తనాలు తరలిస్తున్నా లేదా గ్రామాల్లో విక్రయిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు కేసును ఛేదించిన భీమారం ఎస్‌ఐ ఏ.రాజేందర్‌తో పాటు పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

Scroll to Top