రామగుండంలో విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రజల ఏకగ్రీవ విజ్ఞప్తి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండంలో నూతన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణాన్ని రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను కోరారు.
రామగుండంలో ప్రతిపాదిత విద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రక్రియలో భాగంగా రామగుండం శాసనసభ్యుడు మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ సూచనల మేరకు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఛైర్మన్, ప్రధాన కార్యనిర్వాహక అధికారి హరీష్, ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌లు విద్యుత్ కేంద్ర ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు వారితో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో బొగ్గు, నీటి వనరులు సమీపంలోనే అందుబాటులో ఉన్నాయని, గత ఆరు దశాబ్దాలుగా విద్యుత్ కేంద్రాల్లో పనిచేసిన అనుభవం కలిగిన నైపుణ్య సిబ్బంది ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిపారు. విద్యుత్ కేంద్రం స్థానిక ప్రజల జీవన విధానంతో విడదీయరాని అనుబంధం కలిగి ఉందని, అందువల్ల ఇక్కడే నూతన విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క పలు సందర్భాల్లో రామగుండంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం తన హామీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణతో పాటు ప్రభుత్వానికి అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రజలు స్పష్టం చేశారు. రామగుండంలోనే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో నగర ఉప మేయర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
