ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి….
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు…
–అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్ రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాటిని పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కొప్పుల వెంకట్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ముత్తారం మండలం లక్కారం గ్రామపంచాయతీకి చెందిన వీరగొని రాజేశం మచ్చపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 79లో ఎకరం 33 గుంటల వ్యవసాయ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, భూమిని పునఃసర్వే చేయించి రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరిచేసి హక్కులు కల్పించాలని కోరుతూ, దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై భూ సర్వే, భూ రికార్డుల అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ఓదేల గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన ప్రీ ప్రైమరీ పాఠశాల కేంద్రాన్ని ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి మార్చాలని గ్రామ సర్పంచ్ కనకిరెడ్డి సతీష్ చేసిన వినతిపై జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదావరిఖని కళ్యాణ్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సమ్మక్క తన ఇంటి వెనుక భాగంలో కోత్వాల్ వెంకటేష్ అక్రమంగా తమ ఇంటి సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఫిర్యాదు చేయగా, రామగుండం మున్సిపల్ కమిషనర్‌కు రాస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్‌కు చెందిన కొండా రమాదేవి గృహ జ్యోతి పథకం కింద లబ్ధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సంబంధిత మండల అభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
