ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ఎన్‌టీపీసీ బాధ్యత…
ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై మేయర్ మహంకాళి స్వామి ఆగ్రహం…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంస్థపై ఉందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా 32వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో స్థానిక కార్పొరేటర్ తోట మమత కుమార్‌తో కలిసి పర్యటించిన ఆయన, కాలువల్లో పూడిక తొలగింపు, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ఎన్‌టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సిన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు గతంలో ఇతర ప్రాంతాలకు మళ్లించబడడంతో స్థానికంగా కనీస మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందలేదన్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికైన తర్వాతే ఆ నిధులు స్థానిక అభివృద్ధి పనులకే వినియోగమవుతున్నాయని పేర్కొన్నారు.
వార్డు పర్యటనలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి నమోదు చేశామని, వాటిని దశలవారీగా పరిష్కరించి అన్నపూర్ణ కాలనీని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను బయట వేయకుండా స్వచ్ఛ ఆటోకు అప్పగించాలని సూచించారు.
అనంతరం మేయర్ మహంకాళి స్వామి ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రి ఆవరణలో నెలకొన్న అపరిశుభ్రత, నిల్వ నీరు, చెత్త కుప్పలు, పెరిగిన పొదలు, తుమ్మ చెట్లను గమనించి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా ఎస్‌టీపీ నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతను అలాగే వదిలేయడంతో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. వెంటనే సంబంధిత ఇంజినీర్‌తో ఫోన్‌లో మాట్లాడి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సాధ్యం కాకపోతే గుంతను వెంటనే పూడ్చివేయాలని ఆదేశించారు.
భవనంపై నుంచి డ్రైనేజీ పైపుల ద్వారా నీరు లీకేజీ అవుతున్న సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట చెత్త పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ ఉండడం వంటి సమస్యల ఫొటోలను పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు పంపించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అవసరమైతే ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్, ఏఈ తేజస్విని, ఆర్‌ఐ ఖాజా, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, మెప్మా సీఓ శ్వేత, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ సాగి సంతోష్ రావు, ఆసుపత్రి ఆర్‌ఎంఓ కృపాభాయ్, సీఎంఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
