తాడిచర్ల-2తో మంథని యువతకు ఉద్యోగాల బాట.

Sakshitha news

తాడిచర్ల-2తో మంథని యువతకు ఉద్యోగాల బాట…

ఢిల్లీ నుంచి మంథని వరకు పట్టువదలని పోరాటం…

సింగరేణికి బ్లాక్-2 దక్కేలా చేసిన ఎంపీ వంశీకృష్ణ…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, మంథని/ : మంథని ప్రాంత అభివృద్ధి, సింగరేణి సంస్థ బలోపేతం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. సింగరేణికి తాడిచర్ల బ్లాక్-2ను నేరుగా కేటాయించాలన్న డిమాండ్‌పై ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి నిరంతరం విజ్ఞప్తులు, ఒత్తిడి, ప్రయత్నాలు కొనసాగించడంతో ఎట్టకేలకు తాడిచర్ల-2 కేటాయింపుపై శుభవార్త వెలువడింది.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులతో కలిసి మంథని ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ వంశీకృష్ణ.. సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు తనకు ప్రత్యేక సంతృప్తినిచ్చే అంశమని తెలిపారు.

“సింగరేణికే తాడిచర్ల-2 కావాలి”
తాడిచర్ల బ్లాక్-2ను సింగరేణికి నేరుగా కేటాయించాలని ఎంపీ వంశీకృష్ణ పలుమార్లు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా సంబంధిత స్థాయిల్లో నిరంతరం విజ్ఞప్తులు చేస్తూ ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. సింగరేణి బలోపేతం కావడం, స్థానిక యువతకు ఉద్యోగాలు రావడం, మంథని ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లక్ష్యంగా తాడిచర్ల-2 కోసం కృషి చేశామని పేర్కొన్నారు.

వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
తాడిచర్ల-2 కేటాయింపు మంథని ప్రాంతానికి భారీ శుభవార్త అని ఎంపీ అన్నారు. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, సుమారు 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం బొగ్గు ఉత్పత్తికి పరిమితం కాకుండా వేలాది కుటుంబాల ఆర్థిక భద్రతకు, స్థానిక యువత భవిష్యత్తుకు కొత్త ఆశలు కల్పిస్తుందని చెప్పారు.

మంథని అభివృద్ధిపై రాజీ లేదు
మంథని ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కంకణబద్ధులై పనిచేస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లు, మౌలిక వసతులు, సింగరేణి, ఉద్యోగాలు తదితర రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
“ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గం.. మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. ప్రజల కోసం మొదలుపెట్టిన ప్రతి ప్రయత్నాన్ని ఫలితం వచ్చే వరకు కొనసాగిస్తాం” అని ఎంపీ స్పష్టం చేశారు.

మాట ఇచ్చాం.. సాధించాం
తాడిచర్ల-2 కేటాయింపుతో సింగరేణికి మరింత బలం చేకూరడంతో పాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వంశీకృష్ణ తెలిపారు. మంథని ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

“మాట ఇచ్చాం.. సాధించే వరకు పోరాడాం.. ఫలితం సాధించాం. తాడిచర్ల-2తో మంథని యువతకు ఉద్యోగాల బాట వేయడమే మా లక్ష్యం” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

Scroll to Top