ఐదేళ్లుగా కూలీ రేట్ల పెంపు పెండింగ్.. రైతులు, ఆసాములను రెచ్చగొట్టడం సరికాదు….
ఆందోళనలకు సిద్ధమని హమాలీ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, గోదావరిఖని కూరగాయల మార్కెట్‌లో పనిచేస్తున్న హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని కోరితే, వాటిని పెంచకుండా హోల్‌సేల్ వ్యాపారులు రైతులను, ఆసాములను రెచ్చగొడుతూ హమాలీలను బద్నాం చేస్తున్నారని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని మార్కెట్ అధ్యక్షుడు ఎంఏ గౌస్ ఆరోపించారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా కూరగాయల మార్కెట్‌లో హమాలీల కూలీ రేట్ల పెంపు, ఇతర సమస్యలపై హోల్‌సేల్ వ్యాపారులతో చర్చించి పరస్పర అంగీకారంతో నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం కొనసాగుతోందన్నారు. అదే విధానంలో గతంలో కూలీ రేట్లు పెంచినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న కూలీ రేట్లు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదని, 2019లో నిర్ణయించిన రేట్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. గత ఐదేళ్లుగా పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ హోల్‌సేల్ వ్యాపారులు కూలీ రేట్ల పెంపుపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హమాలీలపై రైతులు, ఆసాముల్లో అపోహలు కలిగించేలా ప్రచారం చేయడం సరికాదని, హమాలీలు రైతుల వద్ద కూరగాయలు ఎత్తుకుపోతున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ఎంఏ గౌస్ అన్నారు.
హోల్‌సేల్ వ్యాపారులు తప్పుడు ప్రచారాన్ని విరమించి హమాలీలకు న్యాయమైన కూలీ రేట్లు పెంచాలని, లేనిపక్షంలో కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కండె లక్ష్మయ్య, రాంచందర్, జానీ మియా, గాలిపెల్లి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
