సింగరేణి కార్మికుడికి అంతర్జాతీయ డాక్టరేట్…..
జానపద నృత్య కళలో నీలాల శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం…
సాక్షిత పెద్దపల్లి //గోదావరిఖని ‘జానపదం నా ప్రాణపదం.. జన జాగృతికే అంకితం’ అనే నినాదంతో జానపద కళకు ప్రాణం పోస్తున్న సింగరేణి కార్మికుడు నీలాల శ్రీనివాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. శ్రీరాంపూర్ ఎస్ ఆర్ పీ. 3&3ఏ గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు, పాండిచ్చేరిలో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ సెమినార్లో ‘ఫైన్ ఆర్ట్స్ ఫోక్ డాన్స్’ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి అంతడుపుల నాగరాజు బృందంలో జానపద నృత్య కళాకారుడిగా శ్రీనివాస్ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.
సింగరేణిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆయన, ఇటీవల నాగపూర్‌లో జరిగిన కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఘనత సాధించడంలో సహకరించిన వెంకటరమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనను నిరంతరం ప్రోత్సహిస్తున్న గురువయ్యకు.అలాగే.మా కుటుంబ సభ్యులు, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక సింగరేణి కార్మికుడికి అంతర్జాతీయ స్థాయి డాక్టరేట్ రావడంపై తోటి కార్మికులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

