తల్లిపాల ద్వారానే శిశువులకు రోగ నిరోధక శక్తి….. జిల్లాకలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
నవజాత శిశువులకు తల్లిపాల ద్వారానే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కాబట్టి మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల నేపథ్యంలో గురువారం ఎం సి హెచ్ లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాల ద్వారానే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కాబట్టి మొదటి ఆరు నెలలు తప్పనిసరిగా తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. బిడ్డలకు తల్లిపాల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు తప్పనిసరి అని, ఆ తర్వాత కూడా ఇతర ఆహారంతో పాటు ఇవ్వవచ్చు అని చెప్పారు. తల్లిపాలతో పిల్లలకి ఎన్నో రకాల పోషకాలు అందుతాయని తెలిపారు.
కేవలం బిడ్డకు మాత్రమే కాకుండా తల్లికి కూడా పాలు ఇవ్వడం వల్ల మంచి లాభాలు ఉన్నాయని చెప్పారు. బిడ్డతో ఎమోషనల్ బాండింగ్ పెరగడమే కాకుండా, రొమ్ము క్యాన్సర్ ముప్పును నివారించవచ్చని తెలిపారు. కాబట్టి తల్లులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు.
డాక్టర్లు సైతం కేవలం చికిత్సకి పరిమితం కాకుండా సమాజంలో ఇటువంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు కూడా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను వివరించిన వైద్యులకు కలెక్టర్ అభినందించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వైద్య విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా "డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు" అంటూ తల్లిపాల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా వైద్య విద్యార్థులు చేపట్టిన నాటక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
పలు వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్
ఎంసిఎచ్ సందర్భంగా భాగంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు వార్డులను తనిఖీ చేసి వైద్యుల అటెండెన్స్ తనిఖీ చేశారు. ఎదుగుదల సరిగా లేని బిడ్డలను మెరుగుపరిచే ఎన్ ఆర్ సి విభాగాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అడ్మిషన్స్, ఒపీ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. అంగన్వాడీల నుంచి ఎన్ ఆర్ సి కి ఎంతమందిని పంపిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఎదుగుదల సరిగా లేని బిడ్డలను ఎన్ ఆర్ సి కి అడ్మిట్ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్ ఆర్ సి విభాగం వినియోగాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నవజాత శిశువుల ఇంక్యుబేటర్ గదిని పరిశీలించిన కలెక్టర్ సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆస్పత్రి లో రోగులను కింద కూర్చోకుండా అదనపు బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, జిజీహెచ్ సూపరిండెంట్, ప్రోగ్రామ్ ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, రామచందర్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

