హెల్మెట్ జరిమానా నుంచి కాదు… ప్రాణాల కోసం ధరించండి…..
గోదావరిఖనిలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం…
–వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, ద్విచక్ర వాహనదారులు ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావుతో కలిసి ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడానికే కాదని, ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లు తదితర నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పకుండా ఉపయోగించాలని సూచించారు.
“గల్లీల్లో వెళ్తే హెల్మెట్ అవసరం లేదు”, “చిన్న దూరం ప్రయాణానికి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు” వంటి తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరని, చిన్న దూరం ప్రయాణాల్లో కూడా ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశముందని హెచ్చరించారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, నిర్లక్ష్యం కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ప్రధాన రహదారులకే కాకుండా ప్రతి రహదారి, ప్రతి వీధిలో సమానంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. జరిమానాల భయంతో అయినా హెల్మెట్ ధరించే అలవాటు చేసుకుంటే, చివరికి అదే వారి ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.
పాల ప్యాకెట్ తీసుకురావడానికి, సమీప దుకాణానికి వెళ్లడానికి లేదా చిన్న పని కోసం మాత్రమే వెళ్తున్నామని భావించి హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దని సూచించారు. ప్రతి ప్రయాణంలో హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని జీవితంలో భాగంగా మార్చుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
