కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి….

Sakshitha news

కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి….

— ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: కరీంనగర్, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు రెండేళ్లు కూడా పూర్తికాకముందే కుంగిపోవడానికి బాధ్యులెవరో మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు డిమాండ్ చేశారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ,కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న హరీశ్ రావు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లను పక్కనబెట్టి డిజైన్లు మార్చడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవకముందే దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఉందన్నారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇప్పటికే మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. కాళేశ్వరం పేరుతో భారీగా ప్రచారం చేసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదని ఆరోపించారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించామని చెప్పారు.

రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని పేర్కొంటూ, రూ.21 వేల కోట్లతో 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ లబ్ధిదారులు మళ్లీ బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందుతున్నారని చెప్పారు.
ఇప్పటికే మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేశామని, రాబోయే రోజుల్లో మిగతా రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున దాదాపు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న వడ్లకు బోనస్ వంటి సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు హితవు పలికారు.

ఈ మీడియా సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top