ప్రభుత్వ ఆస్పత్రిలో కార్మికుల వేధింపులు, డబ్బుల వసూళ్ల ఆరోపణలు…
సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి…
— మద్దెల దినేష్…
సాక్షిత పెద్దపల్లి// గోదావరిఖని,
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో సబ్ కాంట్రాక్టర్‌గా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి, అతనికి సన్నిహితంగా ఉన్న సూపర్వైజర్, ఓ మహిళా కార్మికురాలు కలిసి తోటి కార్మికులపై పెత్తనం చెలాయిస్తూ మానసిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారిక బాధ్యతలు లేకపోయినా కొందరు ఆస్పత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పలువురు కార్మికులు తమకు ఫిర్యాదు చేశారని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి అమలు చేసే రోస్టర్ విధానంలో పారదర్శకత పాటించకుండా, తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మంచి డ్యూటీలు కేటాయిస్తూ, మిగిలిన వారిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పటికీ, మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తులు ఆస్పత్రి వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
సబ్ కాంట్రాక్టర్‌కు సన్నిహితురాలిగా చెప్పబడుతున్న మహిళా కార్మికురాలు గత ఆరు నెలలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారని, ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారనే విమర్శలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల సిబ్బంది కొరత తీర్చేందుకు నియమించిన కార్మికులపై కూడా అదనపు పనిభారం మోపుతూ, విధి సమయం ముగిసిన తర్వాత కూడా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే సూపర్వైజర్ వ్యక్తిగత అవసరాల కోసం తోటి కార్మికుల వద్ద అప్పుగా డబ్బులు తీసుకుని, తిరిగి ఇవ్వాలని అడిగిన వారినే విధుల్లో వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, దీంతో పలువురు కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలిపారు.
ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. అలాగే రోస్టర్ విధానంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, కార్మికులపై అనవసర పనిభారం మోపకుండా విధి సమయాల మేరకే పనులు అప్పగించాలని కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రి పనితీరుపై ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రత్యేక దృష్టి సారించి, వారానికి ఒకసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కార్మికులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మద్దెల దినేష్ విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
