ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన… – హామీలు ఎక్కడ..? పరిష్కారం ఎప్పుడు..?

Sakshitha news

ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన… – హామీలు ఎక్కడ..? పరిష్కారం ఎప్పుడు..?

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ,
ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధిలో దశాబ్దాలుగా తమ శ్రమను అంకితం చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నేడు ఆర్థిక, మానసిక ఇబ్బందులతో తీవ్ర ఆవేదనలో జీవనం సాగిస్తున్నారు. జేఏసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ గేట్-2 వద్ద నిర్వహించిన భారీ ధర్నా కార్మికులలో పెరుగుతున్న అసంతృప్తిని మరోసారి బయటపెట్టింది.

చాలి చాలని జీతాలతో కుటుంబాలను పోషించలేక, అప్పులు చేసి జీవనం కొనసాగిస్తున్న కార్మికులు ఆ అప్పుల భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వారం రోజుల క్రితం మాతంగి కాలనీకి చెందిన శివ అనే యువకుడు అప్పుల బాధతో ఉరివేసుకుని మృతి చెందడం కార్మిక వర్గాలను తీవ్ర విషాదంలో ముంచింది. ఇలాంటి ఘటనలు ఒక్కటే కాక గతంలో కూడా పలువురు కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయినట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరుగుతాయని, ఎన్టీపీసీ బి-కేటగిరీ అమలవుతుందని కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు ఆ దిశగా స్పష్టమైన నిర్ణయాలు లేకపోవడం వారిలో నిరాశను పెంచుతోంది. అంతేకాకుండా కొత్త జీఓలు అమల్లోకి వస్తే కనీసం రూ.26 వేల వరకు వేతనాలు పెరిగే అవకాశం ఉందని యూనియన్ నాయకులు కార్మికుల్లో ఆశలు కల్పించినప్పటికీ, ఆ ఆశలు ఇంకా నెరవేరలేదు.
ఇదిలా ఉంటే ఎన్టీపీసీ యాజమాన్యం రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తూ కార్మికులపై అదనపు భారం మోపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018లో లేబర్ కమిషనర్ సమక్షంలో కుదిరిన 12(3) ఒప్పందం ప్రకారం ప్రమోషన్ పాలసీ అమలు చేయకపోవడం, పీవీసీ సర్టిఫికెట్ల పేరుతో పదేపదే కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం, మెడికల్ టెస్టుల విషయంలో సరైన సదుపాయాలు కల్పించకపోవడం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రత్యేకంగా ధన్వంతరి ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈఎస్ఐ ఆసుపత్రుల వైద్య పరీక్షలను గుర్తించాలని లేదా ధన్వంతరి ఆసుపత్రిలోనే పూర్తి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చక ముందే ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, యూనియన్ నాయకులు మరియు ఎన్టీపీసీ యాజమాన్యం ఒకే వేదికపై చర్చలు జరపాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు.

చట్టబద్ధమైన ఒప్పందాలు అమలు చేస్తూ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కార్మికుల కష్టం మీద నడిచే సంస్థల్లో కార్మికుల జీవితం కూడా గౌరవప్రదంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వాలపై ఉందని కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Scroll to Top