నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు మేలు

Sakshitha news

నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు మేలు

-రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో జీఎస్టీ సదస్సు

ధన్యవాదములు తెలిపి సత్కరించిన భవన నిర్మాణ కార్మికులు

సాక్షిత అవనిగడ్డ: జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవిన్యూ హాలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి సుభాష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని భవన నిర్మాణ వ్యయం తగ్గించాయన్నారు. సిమెంటుపై పది శాతం, వెదురు ఫ్లోరింగుపై ఏడు శాతం, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై ఏడు శాతం జీఎస్టీ తగ్గించిందని వివరించారు. తద్వారా ఉదాహరణకు ద్వితీయ శ్రేణి నగరాల్లో 1000 చదరపు అడుగుల ప్లాటు నిర్మాణం వ్యయం రూ.30లక్షలు అయితే, జిఎస్టి తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు రూ.1,37,000లు ఖర్చు తగ్గుతుందన్నారు. నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక బంగారమై, కార్మికులకు వంద రోజులు కూడా పని దొరకలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భవన నిర్మాణ రంగాన్ని విశేషంగా ప్రోత్సహించేందుకు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. తద్వారా కార్మికులకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జిఎస్టి ద్వారా నిర్మాణ రంగానికి ఊతం లభించి, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భవన నిర్మాణ వ్యయం తగ్గి మేలు కలుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ జీఎస్టీని గణనీయంగా తగ్గిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాల వారికి మేలు చేస్తోందన్నారు. నిర్మాణ రంగాన్ని విశేషంగా ప్రోత్సహించే ముఖ్యమంత్రి చంద్రబాబు భవన నిర్మాణ వ్యయం అదుపు చేసి ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే అవకాశం కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి కార్మికులకు విస్తృత ఉపాధి కల్పించారని తెలిపారు.
రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య దుకాణాలపై నామ ఫలకాలు తెలుగులో ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, జీ.ఎస్.టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, జాయింట్ కమిషనర్ జీ.కల్పన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, డిప్యూటీ
అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మెండు లక్ష్మణరావు (చంటి), తుమ్మల చౌదరి బాబు, డీసీ వైస్ చైర్మన్లు పరిశే చలపతిరావు, బచ్చు రఘునాథ ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ ఎస్సీ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, మండల అధ్యక్షులు లింగం బాబూరావు, ఎంపీటీసీ బొప్పన భాను, చల్లపల్లి సర్పంచ్, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, ఏఎంసీ డైరెక్టర్లు ఉప్పల ప్రసాద్, మంగళగిరి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ లుక్కా వెంకట పిచ్చియ్య, కూటమి నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, పుల్లగోరు రాజేంద్రకుమార్, లుక్కా శ్రీనివాసరావు, మండలి సుధీర్, మండలి శివప్రసాద్, మొగల్ మురాద్ తదితరులు పాల్గొన్నారు.