రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన గోదావరిఖని 1- టౌన్ పోలీసులు…

Sakshitha news

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన గోదావరిఖని 1- టౌన్ పోలీసులు…

ప్రత్యేక వాహన తనిఖీలతో ట్రాఫిక్ నిబంధనలపై హెచ్చరిక….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్, రమేష్‌నగర్ తదితర ప్రాంతాల్లో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతా నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాహన సంబంధిత పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గించుకోవచ్చని వివరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్ల చేత వాహనాలు నడిపించడం వంటి ప్రమాదకర చర్యలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.