కుప్పంలో “స్విమ్స్”వారి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
** సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / కుప్పం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆధ్వర్యంలో కుప్పం ఏరియా ఆసుపత్రిలో సోమవారం సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం, పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. 740 మందికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, 165 మందికి పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ శిబిరంలో కార్డియాలజీ, సిటి సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, సర్జికల్ అంకాలజి, మెడికల్ అంకాలజి, రేడియేషన్ అంకాలజి, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాలజీ విభాగాల వైద్యులు వైద్యసేవలందించారు.
రెండు పింక్‌బస్సుల ద్వారా మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం ఏరియా హాస్పిటల్ కమిటీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి త్రిలోక్, కడ అడ్వైజర్ రాజ్ కుమార్, పీకేఎం చైర్మన్ డాక్టర్ సురేష్, స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, నాయకులు డాక్టర్ సుధీర్, స్విమ్స్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

