పరిశ్రమ భూములను ప్రజల అవసరాలకే ఉపయోగించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70, 80 సంవత్సరాల క్రితం నగరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగిందని, కాలక్రమేణా జనాభా పెరగడం, నగరం విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించడం జరిగిందని వివరించారు.
కాగా తరలించిన పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. సనత్ నగర్ లో పరిశ్రమలకు సంబంధించి 87.31 ఎకరాల భూమి ఉండగా, రిజిస్ట్రేషన్ శాఖ విలువ ఎకరం 21 కోట్ల రూపాయలు, ఓపెన్ మార్కెట్ విలువ 43 నుండి 45 కోట్ల రూపాయలు గా ఉన్నదని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిని ఒక్కో ఎకరం 6.31 కోట్ల రూపాయలకు మాత్రమే ధారాదత్తం చేయాలని చూస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ నగరం పరిధిలో 21 ప్రాంతాలలో ఉన్న 9292 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తక్కువ ధరకు ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగుందని చెప్పారు. కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్ల నిర్మాణం, ప్రజలకు అవసరమైన పార్క్ లు, క్రీడా మైదానాలు, స్మశాన వాటికలు, బస్తీ దవాఖానాలు, మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్, అంగన్ వాడి స్కూల్ భవనాలు వంటి వాటికి స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పరిశ్రమలకు చెందిన భూములలో 50 శాతం ప్రజల అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. తమది ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజల అవసరాలను ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు. తక్కువ ధరకు భూమిని పొందే వారు ఆ భూమి లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలతో ప్రజలకుమేలు జరగాలి తప్ప కొందరు వ్యక్తులకు లబ్ది చేకూర్చాలని చూడడం దుర్మార్గం అన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాలు, పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారి గురించి ప్రభుత్వం ఆలోచించదా అని ప్రశ్నించారు. భూ దోపిడీ పై మంత్రులు ప్రజల్లోకి వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆఘమేఘాల పై పాలసీని తీసుకొచ్చి తక్కువ ధరకు భూములు కట్టబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం విచారకరం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పడంలేదన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం భారీ కుంభకోణం కు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, రేవంత్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, సురేష్ గౌడ్, నరేందర్, లక్ష్మీపతి, కిషోర్, మహేష్ యాదవ్, కూతురు నర్సింహ, రాజేష్ ముదిరాజ్, ఖలీల్ తదితరులు ఉన్నారు.

