భూ రీ-సర్వే విజయవంతానికి రైతులు, ప్రజలు సహకరించాలి…

Sakshitha news

భూ రీ-సర్వే విజయవంతానికి రైతులు, ప్రజలు సహకరించాలి…

పారదర్శకంగా భూ రీ-సర్వే.. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం….

— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి.
రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చేపడుతున్న భూ రీ-సర్వే కార్యక్రమానికి ప్రజలు, రైతులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విజ్ఞప్తి చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలి విడతగా ధర్మారం మండలం పైడిచింతలపల్లి, పెద్దపల్లి మండలం నిమ్మన్‌పల్లి, సుల్తానాబాద్ మండలం రెబ్బల్‌దేవ్‌పల్లి, రామగిరి మండలం పన్నూర్, మంథని మండలం మల్లాపల్లి గ్రామాల్లో భూ రీ-సర్వే కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఆయా గ్రామాల్లో గ్రామ సరిహద్దుల నిర్ధారణ పూర్తికాగా, ప్రస్తుతం గ్రామకంఠం సర్వే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

జూలై 15 నుంచి అంతర్గాం మండలం సోమనపల్లి, ఎలిగేడు మండలం లోకపేట, పెద్దపల్లి మండలం రంగంపల్లి, పాలకుర్తి మండలం గూడిపల్లి, శ్రీరాంపూర్ మండలం మంగపేట, ఓడెల మండలం గూడెం, మంథని మండలం అంగుళూరు, ముత్తారం మండలం శుక్రవారంపేట గ్రామాల్లో భూ రీ-సర్వే కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ గ్రామాల్లో జూలై 14న గ్రామసభలు నిర్వహించి ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.

ప్రతి గ్రామంలో రీ-సర్వే ప్రారంభానికి ముందు గ్రామసభ నిర్వహించి భూ యజమానులకు కార్యక్రమం ఉద్దేశ్యం, విధివిధానాలను వివరించిన తర్వాతే సర్వే చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. సర్వే అండ్ బౌండరీస్ చట్టం–1923 నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు.

భూ రీ-సర్వే ద్వారా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారణ కావడంతో పాటు భూ రికార్డులు నవీకరించబడతాయని, భూ వివాదాల పరిష్కారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సర్వే సమయంలో భూ యజమానులు అవసరమైన పత్రాలతో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు.

భూ రీ-సర్వే కార్యక్రమం విజయవంతం కావడానికి సంబంధిత గ్రామాల రైతులు, ప్రజలు గ్రామసభలకు హాజరై అధికారులు, సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.

Scroll to Top