గుండె ఆగినా… సీపీఆర్‌తో ప్రాణం పదిలం
** విద్యార్థుల్లో అవగాహన పెరగాలని డైరెక్టర్ పిలుపు
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అత్యవసర సమయాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సిపిఆర్)
ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని, విద్యార్థులు దీనిపై అవగాహన పెంచుకొని ఎదుటివారి ప్రాణాలను రక్షించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ విభాగం అండ్ ఇండియన్ సొసైటి ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యాహ్నం శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్ స్కూల్లో సిపిఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్. అల్లాడి మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి నైపుణ్యాలను పెంచుకుని బాధ్యత గల పౌరులుగా సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఆపదలో ఉన్న వారిని మనకు తెలిసిన పరిజ్ఞానం ద్వారా కాపాడగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉండదన్నారు.
విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ సొసైటి ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ప్రతినిధులను అభినందించారు. స్విమ్స్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్. హరికృష్ణ మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ప్రమాదం లేకుండా పరిసరాలను ఎలా మార్చుకోవాలి, వైద్య సహాయం కోసం అంబులెన్సుకు ఫోన్ చేయడం, సమీపంలో ఉన్న ఇతర వ్యక్తుల సహాయం తీసుకోవడం, సిపిఆర్ ఎలా చేయాలి అనే అంశాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ అలోక్ సమంత రే, ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షాకిన, డాక్టర్.సాయితేజ, డాక్టర్ మనోజ్ రాజు.పి, డాక్టర్.శ్రీనివాస్ సూరి శెట్టి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీల్, ఎస్. వి.యు క్యాంపస్ స్కూల్ సిబ్బంది, స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
