అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు….
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరిక….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:రామగుండం, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీసు యంత్రాంగం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని డ్యామ్‌లు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరూ ఆయా ప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేశారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువులు, డ్యామ్‌లు, జలపాతాల వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. చేపల వేట కోసం కూడా నీటి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఆశ్రయం పొందవద్దని, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని ప్రజలకు సూచించారు. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, నీట మునిగిన ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, ఆర్ అండ్ బీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాలని, కల్వర్టులు, చిన్న వంతెనలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని హెచ్చరించారు.
అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది పోలీసు సిబ్బంది 24 గంటలు సేవలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఆపద ఎదురైనా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
